సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? ఇప్పుడేం మాట్లాడుతుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని.. ఇప్పుడు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా వైయస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని మండిపడ్డారు.