జంతువులను చూసేందుకు చాలా మంది జూపార్క్‌లు, సఫారీ పార్క్‌లకు వెళ్తూ ఉంటారు. అయితే క్రూర మృగాలు నివసించే ప్రాంతానికి వెళ్లినపుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతో ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. నిత్యం చెట్లు, జంతువుల మధ్య బతికే ఆ జీవులు.. మనుషులను, వాహనాలను చూడగానే భయానికి గురై పారిపోవడమో లేక దాడి చేయడమో చేస్తూ ఉంటాయి. సఫారీ పార్క్‌కు వెళ్లిన వారు అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు. అయితే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి క్రూర జంతువుల వద్దకు వెళ్లినపుడు అనుకోని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక మరికొన్నిసార్లు మనుషులను, వాహనాలను చూసి ఆ జంతువులు భయపడి దాడులు చేస్తూ ఉంటాయి.
ఇలాంటి సంఘటనే తాజాగా ఓ నేషనల్ పార్క్‌లో జరిగింది. ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ మహిళా టూరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆఫ్రికాలోని కఫ్యూ నేషనల్ సఫారీ పార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టూరిస్ట్‌లతో వెళ్తున్న సఫారీ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఆ సఫారీ వాహనంలోని టూరిస్ట్‌లు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు టూరిస్ట్‌లు తీవ్ర గాయాలపాలయ్యారు.
కఫ్యూ నేషనల్ పార్క్‌లో కొందరు టూరిస్ట్‌లు సఫారీ వాహనంపై ఏనుగులు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అందులోని వారంతా ఏనుగులను చూస్తూ వాటి కదలికలను తమ వద్ద ఉన్న కెమెరాల్లో వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. ఇంతలోనే ఓ ఏనుగు అది గమనించి ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ఏనుగు నుంచి తప్పించుకునేందుకు సఫారీ వాహనం డ్రైవర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ వాహనాన్ని సుమారు అర కిలోమీటరు వరకు ఏనుగు అతి వేగంతో వెంబడించింది. అనంతరం ట్రక్కుపై దాడి చేసి దాన్ని బోల్తా కొట్టించింది.
ఈ ఘోర సంఘటనలో 80 ఏళ్ల అమెరికన్ మహిళా టూరిస్ట్ మరణించింది. ఇక ఆ వాహనంలో ఉన్న మరో ఐదుగురు టూరిస్ట్‌లు కూడా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాయాలపాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కఫ్యూ నేషనల్ పార్క్‌లో సఫారీ వాహనాన్ని ఏనుగు వెంబడించి.. దానిపై దాడి చేసినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ఇలాంటి క్రూర జంతువులు ఉండే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.