సోమాలిలాండ్‌ను స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించడంతో ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రపంచంలోనే ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితిపై చర్చను రేకెత్తించింది. దీంతో ఏంటీ వివాదం? అది ఎక్కడ ఉంది? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ సోమాలిలాండ్‌ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం ఇజ్రాయెల్ కాగా, అమెరికా మాత్రం దీనిని బహిరంగంగా తోసిపుచ్చింది. ఆఫ్రికా యూనియన్ కూడా ఈ చర్యపై మండిపడింది. అంతేకాదు, ఇది తమ ఖండంలో అస్థిరతను సృష్టించవచ్చని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ తీరుపై సోమాలియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ సార్వభౌమాధికారంపై ‘ఉద్దేశపూర్వక దాడి’గా సోమాలియా అభివర్ణించింది. ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈ చర్యపై విరుచుకుపడి, సోమాలిలాండ్ ‘సోమాలియాలో అంతర్భాగం’ అని స్పష్టం చేసింది. ఈ చర్య ఆఫ్రికా అంతటా వేర్పాటువాద ఉద్యమాలకు ప్రమాదకరమైన ముందడుగు వేస్తుందని హెచ్చరించింది.
ఇజ్రాయెల్, సోమాలిలాండ్‌ను ఒక దేశంగా గుర్తించడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. సోమాలిలాండ్, 1991లో సోమాలియా నుండి విడిపోయి, సొంతంగా పాలన, కరెన్సీ, పాస్‌పోర్ట్ వ్యవస్థతో దేశంలానే పనిచేస్తోంది. అయినప్పటికీ, 30 ఏళ్లుగా ఏ దేశం గుర్తించలేదు. ఇజ్రాయెల్ నిర్ణయంపై సోమాలియా తీవ్రంగా స్పందిస్తూ, ‘దేశ సార్వభౌమాధికారంపై ఉద్దేశపూర్వక దాడి" అని ఖండించింది. ఆఫ్రికన్ యూనియన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అమెరికా వంటి అనేక దేశాలు ఈ గుర్తింపును వ్యతిరేకించాయి. సోమాలిలాండ్ మాత్రం దీనిని చారిత్రక విజయంగా అభివర్ణించింది.
ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ వివాదం?
ఆఫ్రికా హార్న్లోని ఉత్తర సొమాలియానే ‘సోమాలిలాండ్‘. 1991 నాటి సోమాలియా అంతర్యుద్ధంలో ప్రభుత్వం కూలిపోవడంతో సోమాలిలాండ్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అప్పటి నుంచి సొంతంగా ఎన్నికైన నాయకత్వం, పార్లమెంట్, పోలీసు వ్యవస్థ, కరెన్సీ, పాస్‌పోర్ట్ వ్యవస్థతో పనిచేస్తోంది. సోమాలియాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మొహమ్మద్ అబ్దిల్లాహి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, దేశ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
సోమాలిలాండ్ సొంతంగా సోమాలిలాండ్ షిల్లింగ్ కరెన్సీ ఏర్పాటుచేసుకుి.. పన్నులు వసూళ్లు సహా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తుంది. బెర్బెరా వంటి ఓడరేవుల ద్వారా వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. ఈ ఓడరేవు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో కీలక ముఖద్వారంగా ఉంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా, పాస్‌పోర్టులు, జాతీయ గుర్తింపు పత్రాలను జారీ చేస్తుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను నడుపుతుంది. ఆరోగ్యం, ప్రజా సేవలను స్వతంత్రంగా నిర్వహిస్తుంది. ప్రజలు మొగదిషులోని సోమాలియా ఫెడరల్ ప్రభుత్వం కంటే, సోమాలిలాండ్ సంస్థలపైనే ఆధారపడుతున్నారు.
సోమాలిలాండ్‌కు బలమైన ప్రభుత్వం, పనిచేసే సంస్థలు ఉన్నప్పటికీ 30 ఏళ్లకు పైగా దానికి గుర్తింపు లభించలేదు. చాలా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్వాతంత్ర్యం సమయంలో ఏర్పడిన సరిహద్దులను, ఒప్పందం లేకుండా మార్చకూడదనే నియమాన్ని పాటిస్తాయి. విడిపోయిన ప్రాంతాలను గుర్తించడం వల్ల ఇతర విభజనవాద ఉద్యమాలు పుట్టుకొచ్చి, అస్థిరత ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన అమెరికా
సోమాలియా మాత్రం సోమాలిలాండ్ తమ భూభాగమేనని చెబుతోంది. ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్ (AU), చాలా దేశాలు సోమాలియాకు మద్దతునిస్తూ సోమాలిలాండ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి.
ఇజ్రాయెల్ నిర్ణయంపై అనేక దేశాలు, ప్రాంతీయ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేదిగా సోమాలియా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ఈ గుర్తింపును సవాలు చేస్తామని స్పష్టం చేసింది. సోమాలియాకు ఆఫ్రికన్ యూనియన్ మద్దతు తెలిపింది.
పశ్చిమాసియా, ఆఫ్రికాతో పాటు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)కి చెందిన 20కి పైగా దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ గుర్తింపును ప్రమాదకరమైన ముందడుగుగా ఆఫ్రికా హార్న్‌లో భద్రతకు ముప్పుగా అభివర్ణించాయి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్ వంటి అరబ్ దేశాలు ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపాయి. ఇంటర్‌గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవలప్మెంట్ (IGAD) వంటి ప్రాంతీయ కూటములు కూడా ఈ చర్యను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టానికి, ప్రాంతీయ సహకార సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సమర్దించబోమని అమెరికా స్పష్టం చేసింది. సోమాలియా ప్రాదేశిక సమగ్రతను గుర్తించడం కొనసాగిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ మార్గాన్ని అమెరికా అనుసరించదని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. ‘సోమాలిలాండ్ అంటే నిజంగా ఏమిటో ఎవరికైనా తెలుసా?’ అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సోమాలిలాండ్ స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమని అభివర్ణించిన అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మహమ్మద్ అబ్దిల్లాహీ.. ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆరంభమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మాదిరిగా మిగతా దేశాలు కూడా తమను గుర్తిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa