ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వయస్సులో అమ్మాయీ.. నువ్వొక అద్భుతం! ఇది కదా టెక్నాలజీని వాడుకునే పద్ధతి

national |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:48 PM

అలెక్సా.. ‘నాటు నాటు సాంగ్’ పెట్టు. అలెక్సా స్టాప్.. - ఈ మధ్య కొంత మంది ఇళ్లలో చిన్నారుల నోటి నుంచి వచ్చే ఇలాంటి మాటలు ముచ్చటగొల్పుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ తెచ్చిన ఈ సాధనం చాలా మంది ఇళ్లలో పిల్లలకు మంచి మిత్రుడిగా మారింది. తొలిసారిగా ఈ టెక్నాలజీని చూసిన వాళ్లకు, పల్లెటూర్ల నుంచి నగరాల్లో బంధువుల ఇంటికి వచ్చిన వాళ్లకూ ఇది వింతగా అనిపిస్తుంది. చిన్న వయస్సులోనే పిల్లల తెలివితేటలు చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక ఈ ‘అలెక్సా’ డివైస్‌ను ఉపయోగించిన తీరు గురించి చెబితే మాత్రం మీరు ఓ పట్టాన నమ్మకపోవచ్చు. అవును. ఇది నమ్మలేని నిజం. ఆ వయస్సులో ఆ బాలిక ప్రదర్శించిన తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి విషయాల్లో అందరి కంటే ముందే ఉండే.. మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు. పెద్దయ్యాక ఆ బాలికకు తమ సంస్థలో ఉద్యోగాన్ని ఖరారు చేశారు. ఆనంద్ మహీంద్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అంతకంటే ముందు అసలేం జరిగిందో చూద్దాం..


ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో పంకజ్ ఓజా కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం (ఏప్రిల్ 5) వారి ఇంటికి బంధువులు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో వారు గేట్ గ్రిల్ వేయడం మర్చిపోయారు. ఆ ప్రాంతంలో అసలే కోతుల తాకిడి ఎక్కువ. ఇంకేం.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంట్లోకి కోతుల మంద దూరింది. ఆ సమయంలో పంకజ్ ఓజా 15 నెలల కుమార్తె వామిక కిచెన్‌లో ఆడుకుంటోంది. మరో బాలిక 13 ఏళ్ల నికిత (పంకజ్ భార్యకు వరుసకు సోదరి) ఆ చిన్నారి వద్ద ఉంది. కోతుల మంద ఇంట్లోకి వస్తూనే ఇళ్లంతా చిందరవందర చేసింది. ఆహారం కోసం గాలిస్తూ.. కొన్ని కోతులు కిచెన్ వైపు దూసుకొచ్చాయి.


అలాంటి ప్రమాదకర సమయాల్లో పెద్ద వాళ్లకే ఏం చేయాలో తోచదు. కానీ, చిన్నారి నికిత చాలా తెలివిగా ఓ మెరుపు ఆలోచన చేసింది. ఫ్రిడ్జ్ వద్ద పైన ఉన్న ‘అలెక్సా’ సాధనం వద్దకు పరుగెత్తుకొచ్చి.. ‘అలెక్సా.. కుక్క లాగా అరువు’ అంటూ ఆదేశం ఇచ్చింది. అది కుక్క మాదిరిగా అరవడం ప్రారంభించడంతో కోతులు భయపడి ఇంట్లో నుంచి పారిపోయాయి. రెండంతస్తుల ఆ ఇంట్లో ఓ గదిలో ఉన్న కొంత మంది కుటుంబసభ్యులు కాస్త ఆలస్యంగా అక్కడి అలజడిని గుర్తించి, చిన్నారుల వద్దకు పరుగెత్తుకొచ్చారు. ఇంట్లో నుంచి కోతులు పారిపోవడం, అలెక్సా అరుపులు గమనించగానే వారికి విషయం ఇట్టే అర్థమైంది. 15 చిన్నారిపై ఆ కోతులు దాడి చేసుంటే.. ప్రాణాలకే ప్రమాదం జరిగేది. చిన్నారి నికిత ఎంత తెలివైన ఆలోచన చేసిందీ..!


టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడుకునేవాళ్లకు అద్భుత ఫలితాలను ఇస్తుంది. సరిగ్గా వాడుకోకపోతే దుష్పరిణామాలను చూడాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్న పిల్లలు, రీల్స్ మోజులో పడి యువత చేస్తున్న పిచ్చి చేష్టలు తల్లిదండ్రులతో పాటు సమాజానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నికిత ప్రదర్శించిన తెలివితేటలను కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఆ బాలిక ఆలోచన అసాధారణమైనదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘ఆమె (నికిత) తన చదువు పూర్తి చేసిన తర్వాత, ఒకవేళ కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే, మా సంస్థలో జాబ్ సిద్ధంగా ఉంటుందని, మాతో కలిసి పనిచేసేందుకు మా వాళ్లు ఆమెను ఒప్పించగలుగుతారని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.


‘టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? మాస్టర్స్ అవుతామా అనేది ప్రస్తుతం మన ముందున్న అతి పెద్ద ప్రశ్న. సాంకేతికత ఎల్లప్పుడూ మనిషి నేర్పును మరింత మెరుగుపరుస్తుందని ఈ బాలిక కథ నేర్పుతుంది’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ‘కోతులను చూసి 15 నెలల వామిక చాలా భయపడిపోయింది. అలాంటి సమయంలో తాను భయపడి పారిపోకుండా, తన మేనకోడలిని రక్షించేందుకు నికిత మంచి ఆలోచన చేసింది. అలెక్సాను వాడుకుంది. తను చేసిన పనివల్ల కోతుల బారి నుంచి ఇద్దరూ బయటపడ్డారు’ అని నికిత తల్లి శిప్రా ఓజా అన్నారు. అలెక్సా అనేది అమెజాన్ సంస్థ అభివృద్ధి చేసిన క్లౌడ్ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్. టైమర్స్, పాటలు వినడం, ప్రశ్నలు అడగటంతో పాటు పలు దైనందిన కార్యక్రమాల కోసం ‘అలెక్సా’ ఉపయోగపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa