తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది. తాము 5 కేసుల్లో చార్జిషీటు వేశామని ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొంది. చాలా ఫోటో స్టాట్ కాపీలు తీయాల్సి వస్తుందని ఐజీ తెలిపారు. జిరాక్సులు తీసే సమయంలో ఫోటో స్టాట్ మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని వివరణ ఇచ్చారు. దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని వాటి స్ధానంలో ఫ్రెష్ కాపీలు తీసుకుంటామని ఐజీ వెల్లడించారు.