మాజీ మంత్రి,వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత.. సుప్రీంలో సవాలు చేశారు. సునీత పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. శివశంకర్ రెడ్డితో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి గత నెల 11న బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది. వీటితో పాటు దేవిరెడ్డి పాస్ పోర్ట్‌ను సరెండర్ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.