స్కూల్‌లో బెత్తంతో దెబ్బలు తినని విద్యార్ధి లేడంటే అతిశయోక్తి కాదు. గోడకుర్చీలు, అరదండలు సరేసరి. ఈ అనుభవం తనకు కూడా ఎదురైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. తాను కూడా టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్నానని ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటనను గుర్తుచేసుకున్నారు. ఇది తనను జీవితాంతం వెంటాడుతోందని, బలమైన ముద్ర వేసిందని ఆయన చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో శనివారం ఓ సెమినార్‌కు హాజరైన ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
‘పిల్లలను మనం ఎలా చూస్తామనేది వారి మనసులో నాటుకుపోతుంది.. వారి జీవితంపై బలమైన ముద్ర వేస్తుంది.. నేను ఐదో తరగతిలో ఉండగా స్కూల్‌లో ఆ రోజు జరిగిన ఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను.. నేనేమీ తప్పులు చేసి దెబ్బలు తినే రకం పిల్లాడిని కాను.. కానీ, క్రాఫ్ట్ క్లాస్‌లో అసైన్‌మెంట్ కోసం సరైన సైజ్ సూది తీసుకురాలేదు.. దీంతో టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తినాల్సి వచ్చింది.. అప్పటికీ టీచర్‌ను బతిమిలాడా.. దయచేసి నా చేతుల మీద కొట్టొద్దని.. కావాలంటే పిర్ర మీద కొట్టాలని అడిగాను... కానీ టీచర్ మాత్రం కుడి అరచేయిపై కర్రతో బాదారు. 10 రోజుల దాకా నొప్పి తగ్గలేదు.. ఆ చేతిని అమ్మానాన్నలు సహా ఎవరికీ చూపించకుండా దాచుకొనేవాడిని’ అని జస్టిస్ చంద్రచూడ్ చిన్ననాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం దీని గురించి వివరిస్తూ ‘భౌతికంగా నా చేతికి అయిన గాయం మానింది.. కానీ అది జీవితాంతం నా మనసులో చెరగని ముద్ర వేసింది... నేను పని చేసేటప్పుడు కూడా అదింకా నాతో ఉంది.. చిన్నతనంలో పిల్లలకు జరిగే అలాంటి అవమానం వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది’ అని సీజేఐ చెప్పారు. ‘బాల నేరస్థులు–న్యాయం’ అనే అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు నిర్వహించిన జాతీయ సదస్సుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న పిల్లల ప్రత్యేక అవసరాలను, దుర్బల పరిస్థితులను న్యాయస్థానాలు గుర్తించాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. బాల నేరస్థులు సమాజంలో తిరిగి స్థానం సంపాదించుకొనేలా వారికి అవకాశాలు కల్పించాలని సూచించారు. వారి విషయంలో జాలి, కరుణతో స్పందించాలని ఆయన కోరారు. అలాగే, కౌమారదశ బహుముఖ స్వభావాన్ని, సమాజంలోని వివిధ కోణాలతో దాని పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు.
ఈ సందర్భంగా ఇటీవల మైనర్ అత్యాచార బాధితురాలి అబార్షన్ పిటిషన్ గురించి సీజేఐ ప్రస్తావించారు. ఇండియన్ జువైనల్ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. అసంపూర్ణమైన మౌలిక సౌకర్యాలు, వనరులు లేమి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక రద్దీ, నాసిరకం బాల్య నిర్బంధ కేంద్రాలకు దారితీసిందని చెప్పారు. దీని కారణంగా బాల నేరస్థులకు సరైన మద్దతు అందక పునరావాసం కల్పించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని ఆయన అన్నారు. చాలా మంది బాలల ముఠాల ద్వారా నేరస్థులుగా మారుతున్నారని, ఈ సామాజిక వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వైక్యలం కలిగిన పిల్లలు కౌమారదశలో ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని,. దేశంలో చూపులేని పిల్లలను భిక్షాటన కోసం ముఠాలు ఎలా ఉపయోగించుకుంటున్ానయో చూస్తున్నామని సీజేఐ వ్యాఖ్యానించారు.