కిర్గిస్థాన్‌లోని విదేశీ విద్యార్థులే లక్ష్యంగా అల్లరి మూక దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కిర్గిజ్ రాజధాని బిష్కెక్‌లో మూక హింస చెలరేగడంతో అక్కడ భారతీయ విద్యార్థుల భద్రతపై అడ్వైజరీ జారీచేసిన భారత రాయబార కార్యాలయం.. ఎవరు బయటకు రావొద్దని సూచించింది. మూక దాడిలో పాకిస్థాన్ విద్యార్థులు పలువురు గాయపడ్డారు. వారుండే హాస్టల్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల భద్రతపై కేంద్రం ఆందోళన చెందుతోంది.
‘మన విద్యార్థులతో టచ్‌లో ఉన్నాం.. వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం.. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చి ప్రశాంతత నెలకున్నప్పటికీ.. విద్యార్థులు బయటకు రావొద్దు.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి’అంటూ హెల్ప్‌లైన్ నంబర్ 0555710041ను షేర్ చేసింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్ సైతం ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. విద్యార్థులు బయటకు రావద్దని, ఏదైనా అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించారు. ‘బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల భద్రతను పర్యవేక్షిస్తున్నాం... ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి... రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని విద్యార్థులకు గట్టిగా సూచించాం’ అని తెలిపారు.
కిర్గిస్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలే దాడులకు కారణమని తెలిసింది. మూక దాడిలో ముగ్గురు పాకిస్థాన్ విద్యార్థులు చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిని కిర్గిజ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. విదేశీ విద్యార్థులు ఎవరూ చనిపోయినట్టు నివేదికలు లేవని తెలిపింది. పాక్ ఎంబసీ సైతం కిర్గిజ్; ఈజిప్టు విద్యార్థుల మధ్య ఘర్షణల వల్లే మూక దాడులు మొదలైనట్టు పేర్కొంది. ఈ మూక బిష్కెక్‌లోని మెడికల్ యూనివర్సిటీ హాస్టళ్లపై దాడిచేస్తూ.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారు.
‘ఇప్పటి వరకూ బిష్కెక్‌లో మెడికల్ యూనివర్సిటీల్లోని కొన్ని హాస్టళ్లు, ప్రయివేట్ రెసిడెన్సుల్లోని పాకిస్థాన్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు... పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలైనట్టు నివేదికలు వస్తున్నాయి.. కానీ, పాక్‌కు చెందిన విద్యార్థులపై అత్యాచారం చేసి చంపేసినట్టు సోసల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు.. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎటువంటి అధికారిక నివేదికలు రాలేదు’ అని పాక్ ఎంబసీ పేర్కొంది.