తెనాలి స్ధానిక బోసురోడ్డులోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరంలో అదివారం అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారు అన్నమాచార్య సంకీర్తన పోటీలను నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తన పోటీలకు ముఖ్యఅతిథిగా విజయవాడ ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్, న్యూస్ అసిస్టెంటు ఎడిటర్, మ్యూజిక్ డిప్లమా టీచర్ కేఎన్ పూర్ణచంద్రిక పాల్గొని, న్యాయ నిర్ణ్ణీతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాటల పోటీలు బాల బాలికలలో భక్తిభావం పెంచడానికి దోహదపడతాయని, పోటీతత్వం అలవడుతుందని అన్నారు. సంస్థ కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నమాచార్యుల సంకీర్తనలు ప్రచారం నిమిత్తం ఈ అన్నమయ్య పాటల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నమయ్య పాటల పోటీలలో జూనియర్ విభాగంలో 52మంది, సీనియర్ విభాగంలో 60మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ వారు పోటీలలో పాల్గొన్నవారికి అల్పాహారాన్ని అందించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఆలపించిన అన్నమయ్య పాటలు శ్రోతలను, ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సభ్యులు కొండపి వసుంధర, లక్కరాజు కనకదుర్గ, అందె బాలచంద్రమౌళి, పెరవలి వంశీకృష్ణ, కారంపూడి రమాదేవి, వీరంశెట్టి లక్ష్మీరజని, బొంతల శాంతి, అందె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.