పల్నాడు పోలింగ్ విధ్వంసాలపై ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగా మరోవైపు పోలీసులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకేసారి పెద్దసంఖ్యలో పోలీసులు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామానికి నలువైపులా తనిఖీలు చేపట్టి గ్రామంలో ఉన్న వారిని బయటకు వెళ్లకుండా బయటవారిని గ్రామంలోకి రానివ్వకుండా కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. గృహాలు, శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న గృహాలు, వాముల్లో, కొష్టాల్లో, పొదల్లో సోదాలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున జరిపిన కార్డెన్‌సెర్చ్‌లో ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘాతో పాటు ఎక్కడికక్కడ పికెట్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో మాచర్ల మండలం కంభంపాడులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మారణాయుధాలు, కర్రలు, రాడ్లు, కంకరరాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సోదాలు చేశారు.