వైసీపీ ప్రభుత్వం తమకొద్దని, ఇంటికి పంపటానికే ప్రజలు క్యూలో ఓట్లు వేయటానికి బారులు తీరారని రాజధాని అమరావతి రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు రైతు కూలీలు, మహిళలు ధర్నా శిబిరాలు ఇళ్ల వద్ద నుంచి చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఆదివారం నాటికి 1615వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజధాని రైతులు మాట్లాడుతూ, అమరావతి రాజధాని అని గత ఎన్నికల ముందు వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం జగన్‌రెడ్డి అమరావతిని ఎలాగైనా నాశనం చేయాలనే సంకల్పంతో పాలన చేశారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని స్పష్టం చేశారు. మోసం కొంత కాలమే చెల్లుతుందన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి.. రాజధాని అమరావతి శాశ్వతమన్నారు. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలోనే అది ఉందన్నారు. తొమ్మిదేళ్లుగా అమరావతి రాజధానిగా చేసుకొని పరిపాలన రెండు ప్రభుత్వాలు సాగించాయన్నారు. అటువంటప్పుడు అమరావతిని అంగుళం కూడా కదలదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29గ్రామాలలో రైతు ఆందోళనలు కొనసాగుతున్నాయి.