ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో.. నారా లోకేష్ ట్విట్టర్‌లోకి ఎలా వచ్చిందని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసంచేసిన వీడియో ఎవరు లీక్ చేశారు..? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ నుంచి బయటకు రావాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్‌లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. పోలింగ్ బూత్‌లోని వీడియోను కలెక్టర్ అయినా రిలీజ్ చేయాలి లేదా ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన వారైనా రిలీజ్ చేయాలన్నారు. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్‌గా తెలుగుదేశం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్‌లోకి ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్‌లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు.