హజ్ యాత్రికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. మే 27వ తేదీ నుంచి మూడు రోజులు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి జెడ్డాకు ప్రత్యేక విమానాలు నడపనున్నారు. మరోవైపు హజ్ యాత్రికుల బస కోసం విమానాశ్రయానికి దగ్గర్లోకి మదర్సాలో ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. 2024 హజ్ యాత్ర కోసం మొత్తం 2902 మందిని ఏపీ నుంచి హజ్ కమిటీ ఎంపిక చేసింది.
హజ్ యాత్ర కోసం ఏపీ కోటా కింద 2,931 బెర్తులు కేటాయించారు. అయితే 2902 అప్లికేషన్లు రాగా.. దరఖాస్తుల పరిశీలన తర్వాత 2902 మందికి హజ్ కమిటీ అవకాశం కల్పించింది. అయితే వీరిలో 75 శాతం మంది వరకూ హైదరాబాద్, బెంగళూరుు, చెన్నై నుంచి ప్రత్యేక విమానాల్లో వెళ్లనున్నారు. విజయవాడను 839 మంది మాత్రమే ఎంచుకున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు, 1239 మంది హైదరాబాద్ నుంచి, 810 మంది బెంగళూరు నుంచి, 14 మంది చెన్నై నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. మిగతా 839 మంది గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయల్దేరి వెళ్తారని వివరించారు.
ఈ 839 మంది మే 27, 28, 29 వ తేదీల్లో మూడు విమానాల్లో హజ్ యాత్రకు వెళ్లనున్నారు. మొదటి విమానం మే 27, మే 28న రెండో విమానం, మే 29న మూడో విమానం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి చేరుతాయి. మరోవైపు హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైనారిటీ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. యాత్రికుల ప్రయాణ వివరాలు, హజ్ క్యాంపులో రిపోర్టింగ్ చేసే సమయాన్ని వాట్సాప్ ద్వారా యాత్రికులకు పంపించారు. ఇదే సమయంలో సందేహాల నివృత్తి కోసం 1800-4257873 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.
విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికి ఒక్కొక్కరి ఖర్చును 4.02 లక్షలుగా హజ్ కమిటీ నిర్ణయించింది. అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వెళ్లేవారికి ఈ మొత్తం కాస్త తక్కువ. ఇదే సమయంలో కర్నూలు నుంచి వెళ్లే యాత్రికులు హైదరాబాద్‌ను ఎంచుకుంటుండగా.. కడప, అనంతపురం జిల్లాల వాసులు బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లావాసులకు చెన్నై దగ్గర కావటంతో అటువైపు వెళ్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.