మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, కండ్లగుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యాలరావు ఎన్నికల రోజున 114వ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నారు. ఆరోజు రిగ్గింగ్ కోసం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి బూత్‌లోకి వెళ్లారు. అప్పుడు మాణిక్యాలరావు ఆయన్ను అడ్డుకోబోయారు. ఇది చట్టవిరుద్ధమని, రిగ్గింగ్ జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని తెగేసి చెప్పారు. దీంతో.. వెంకట్రామిరెడ్డి హంగామా సృష్టించారు. అనంతరం నిన్ను కూడా చంపేస్తామని బెదిరించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో భయబ్రాంతులకు గురైన మాణిక్యాలరావు.. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు దృష్టికి చేరింది. వెంకట్రామిరెడ్డి పాల్పడిన ఈ అరాచకం గురించి తెలిసి, మాణిక్యాల రావుకి అండగా నిలిచారు. ఆయనకు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. మీకేం కాదని, ధైర్యంగా ఉండాలని, ఏం జరగకుండా తాము చూసుకుంటామని ధైర్యం చెప్పారు. వైసీపీ అల్లరి మూకకు భయపడాల్సిన అవసరం లేదని, ఎంతో ధైర్యంగా రిగ్గింగ్ జరగకుండా చూసుకున్నారని మాణిక్యాలరావుని ప్రశంసించినట్లు తెలిసింది. అటు.. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.