ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బాబు.ఎ, ఎం.హరి జవహర్‌లాల్, కె.కన్నబాబు, సీహెచ్ హరికిరణ్, జీవీరపాండియన్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అవసరమైన మెటీరియల్ అంతా ఇప్పటికే సభాస్థలి వద్దకు చేరుకుంది. శనివారం సాయంత్రం నుంచి ప్రధాన స్టేజీ పనులు మొదలుపెట్టారు. గోకరాజు గంగరాజుకు చెందిన స్థలంతోపాటు మేధా టవర్స్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, వాహన పటుత్వ కేంద్రం, కేసరపల్లి పెట్రోల్ బంక్ పక్క భూమి.. ఇలా పలు చోట్ల పార్కింగ్ స్థలాల కోసం పరిశీలన జరిపారు. సుమారు లక్షకు పైగా ప్రజలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. 80 వేలు సిట్టింగ్ వేస్తున్నట్లు తెలిసింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇక్కడే పసుపు కుంకుమ బహిరంగ సభ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పెందుర్తి వెంకటేశ్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.