జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు. వీరిలో 16 మంది తెలంగాణ నుంచే ఉంటే.. మిగతా 10 మంది ఏపీకి చెందినవారున్నారు. ఆల్ ఇండియా టాప్-10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు తెలంగాణ, ఒక ర్యాంకు ఏపీ విద్యార్థికి దక్కాయి. హైదరాబాద్ విద్యార్థి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సందేశ్ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, పుట్టి కుశాల్‌కుమార్ ఐదోర్యాంకు, ఎస్‌ఎ్‌సడీబీ సిద్థ్విక్ సుహాస్ పదో ర్యాంకుతో మెరిశారు. అదేవిధంగా ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కొండూరు తేజేశ్వర్ 331/360 మార్కులు సాధించి 8వ ర్యాంకు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ మద్రాస్ ఆదివారం విడుదల చేసింది.