ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 సీట్లతో ఓటమిని చవిచూసింది. అంత ఘోరంగా ఎలా ఓడిపోయామన్నది పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. అయితే ఎన్నికల్లో ఓటమిపై ఆయా జిల్లాల్లోని నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం కర్నూలు జిల్లా ముఖ్య కార్యకర్తలతో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తాను ఒక్కడినే ఓడి పోలేదని...రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, అధికారులు తమ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ ఓటమికి ప్రధాన కారణమని కాటసాని చెప్పుకొచ్చారు. ఆ యాక్ట్ వల్లే తమ కొంప ముంచిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని తాము ఎంత మొత్తుకున్నా ఎవరూ తమ మాట పట్టించుకోలేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. రైతుల భూములు లాగేసుకుంటారన్న ప్రచారం పార్టీకి వ్యతిరేకంగా మారిందని కాటసాని విచారం వ్యక్తం చేశారు.. ఈ యాక్ట్ వచ్చిన 10 రోజుల్లోనే ఏపీలో సీన్ మారిందని దీనికి తోడు టీడీపీ నేత చంద్రబాబు అడుగడుగునా వైసీపీపై దుష్పచారం చేయడంతో రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ కూడా వైసీపీకి నష్టం కలుగజేసిందని అన్నారు. ముఖ్యంగా... జగన్, అధికారులు తమ మాట వినుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఎన్నికల్లో గెలిచేవాళ్లమని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.