ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది. దీంతో విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రా నుంచి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న రెండో వ్యక్తి అయ్యన్నపాత్రుడు కానున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి స్పీకర్ కానున్న మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. మొదట స్పీకర్‌గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండో శాసనసభ స్పీకర్‌గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పీకర్లుగా ఉత్తరాంధ్రాకు చెందిన నాయకులు పనిచేశారు. ఆంధ్రరాష్ట్రంలో రెండో శాసనసభ స్పీకర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం లక్ష్మి నరసింహదొర పనిచేశారు. 1955 ఏప్రిల్ 23 నుంచి 1956 డిసెంబర్ 3 వరకు ఆయన ఆంధ్రరాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదే జిల్లాకు చెందిన తంగి సత్యానారాయణ, కె ప్రతిభా భారతి సైతం స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ స్పీకర్‌గా పనిచేశారు. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తులు ఎంతోమంది స్పీకర్లుగా పనిచేశారు.
![]() |
![]() |