పొన్నూరు పట్టణంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కాసినప్పటికి అకస్మాతుగా వాతావరణంలో మార్పులు చెంది ఆకాశం మేఘావృతమైంది. సుమారు అరగంట పాటు పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకస్మాతుగా భారీ వర్షం కురవటంతో జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని జీబీసీ రోడ్డులో వర్షపునీరు భారీగా చేరి ప్రజల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రహదారిపైనే నిలిచిపోయింది. వాన నీటిలోనే వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా భారీ వర్షంతో అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండ వేడితో ప్రజలు ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కురవటంతో వ్యవసాయ పనులు ప్రారంభించటానికి అనువుగా ఉంటుందని అన్నదాతలు అంటున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే భారీ వర్షాలు కురిస్తే పంట పొలాలు దుక్కులు దున్ని పంటల సాగుకు సన్నద్ధం కావచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |