రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని నండూరు గ్రామం వద్ద బుధవారం భద్రయ్య డ్రెయిన్ ఆధునికరణ పనులను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుగు పట్టి మట్టి తవ్వకం చెప్పట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌తో మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం టీడీపీ హాయంలోనే కాల్వ అధునికీకరణ పనులు జరిగాయన్నారు. 6, 7 సంవత్సరాలుగా డ్రెయిన్ పూర్తిగా పూడుకు పోయింది. ముంపు సమయాల్లో పంట నుంచి మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేక తీవ్ర ఇబ్బంధులు ఎదుర్కొంటున్నామన్నారు. మండల పరిధిలోని ఇట్టింకపాడు గ్రామం నుంచి నండూరు కొల్లిమర్ల డ్రెయిన్ వరకు ఉన్న భద్రయ్య కాల్వ పూర్తిగా పిచ్చిచెట్లు మొలిచి, మట్టి మేటలు వేయటంతో మురుగు నీరు బయటకు పారటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గత మూడు, నాలుగేళ్లుగా పంట కోత దశలో అధిక వర్షాలు కురిసి పంట నీటిమయం అయినప్పుడు వర్షపు నీరు పొలాల నుంచి దిగువకు పారే అవకాశం లేక తీవ్రంగా నష్టపో యామని రైతులు వాపోయారు. దీనిపై గత పాలకులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనికరం చూపలేదని వాపోయ్యారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో కాల్వల ఆధునికీకరణ పనులు చెప్పట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు, నీటి పారుదలశాఖ అధికారులు సమష్టిగా కాల్వల ఆధునికీకరణ పనులు చెప్పట్టాలని ఆదేశించారు. కాల్వలో పేరుకుపోయిన పూడికను తీయడంతో పాటు వీడ్ రిమూవర్ పనులను త్వరితిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మేట తొలగించిన మట్టిని కాల్వ కట్టల పట్టిష్ఠతకు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో మురుగు నీటి శాఖ ఏఈ రమేష్ బాబు, ఇట్టికంపాడు, నండూరు గ్రామాల రైతులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.