2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన షర్మిల.. తండ్రి రాజకీయ వారసత్వాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ అసలైన రాజకీయ వారసురాలిని తానేనంటున్నారు షర్మిల. వైసీపీకి, వైఎస్ఆర్‌కు సంబంధం లేదని అన్నారు. విజయవాడలో విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల.. టీడీపీ కూటమి ప్రభుత్వంతో పాటుగా వైసీపీపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో చంద్రబాబు కూటమి పాలనకు నెలరోజులు పూర్తయ్యాయన్న వైఎస్ షర్మిల.. నెల గడిచిన సూపర్ సిక్స్‌లో ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై ఉలుకూపలుకూ లేదన్నారు. కర్ణాటక, తెలంగాణల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాంగ్రెస్ పార్టీ నెలరోజుల్లోపే అమలు చేసిన సంగతిని గుర్తుచేశారు.మహిళలకు రక్షణ, ఆర్థిక వెసులుబాటు కలిగించే పథకంగా పేర్కొన్న షర్మిల.. ఈ చిన్న పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబుకు ఇంత సమయం ఎందుకు పడుతోందో అర్థం కావడంలేదన్నారు. ఇక తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే పిల్లలు అందరికీ ఏడాదికి రూ.15000 వేలు ఇస్తామన్నారన్న షర్మిల.. జీవోలో ప్రతి తల్లికి రూ.15000 అని రాశారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి రూ.15000 ఇస్తారా లేదా ప్రతి తల్లికి రూ.15000 ఇస్తారా అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు గతంలో వైఎస్ జగన్ కూడా ఇలాగే అమ్మ ఒడి విషయంలో అందరినీ మోసం చేశారని షర్మిల ఆరోపించారు. అమ్మ ఒడి గురించి తనతో కూడా తప్పుడు ప్రచారం చేయించారని షర్మిల విమర్శించారు. మరోవైపు ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని వైఎస్ షర్మిల ప్రస్తావించారు. వైసీపీ కక్షపూరిత చర్యలకు.. వైఎస్ఆర్‌ను బాధ్యుడిని ఎలా చేస్తారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. వైఎస్ఆర్ వైసీపీ నాయకుడు కాదన్న షర్మిల.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన, శ్రామిక రైతు పార్టీ అని.. వైఎస్ఆర్ పార్టీ కాదని, ఆయనకు, వైసీపీకి సంబంధం లేదని అన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మీద షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజున వైఎస్ జగన్ ఏం చేశారు?. ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ కేవలం ఐదు నిమిషాలు ఉన్నారు. కనీసం కూర్చోలేదు. నిలబడి తూతూమంత్రంగా నివాళులు అర్పించారు. అంతేనా? సొంత తండ్రి కదా.. 75వ జయంతి చేయాల్సింది అంతేనా? సిద్ధం సభలంటూ కోట్లు ఖర్చుపెట్టారు కదా. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కనీసం ఒక సభ పెట్టలేకపోయారే. వైసీపీ నాయకులు కూడా ఏం చేయలేదు. ఇలాగేనే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి జరుపుకునేది?. వైఎస్ఆర్..మా తండ్రి, మా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావునే మేము అంత పెద్ద సభ పెట్టాం. ప్రముఖులను రప్పించాం. మేము చేశాం. మీరేం చేశారు?. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు.." అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.