ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమల్లో.. వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన మాటను కూడా 11 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా నూతన సంప్రదాయానికి నాంది పలికారు చంద్రబాబు. సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత సాధించారు. అయితే గుంటూరు జిల్లా పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు.. ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కటిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం 11 రోజుల వ్యవధిలోనే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
జులై ఒకటో తేదీన గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటలకు ఎస్టీ కాలనీలోని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ క్రమంలోనే ఎస్టీ కాలనీలో ఉన్న బాణావత్ పాములు నాయక్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్ అందజేశారు. అలాగే అమరావతిలో భూమిలేనివారికి అందజేస్తున్న పింఛన్‌ను పాములు నాయక్ సతీమణికి స్వయంగా అందజేశారు. అనంతరం వారు ఇచ్చిన టీ తాగిన చంద్రబాబు.. యోగక్షేమాలు కనుక్కున్నారు.
ఈ క్రమంలోనే పాములు నాయక్ ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయిన చంద్రబాబు.. ఇల్లు కట్టుకోకుండా పూరి గుడిసెలో ఎందుకు ఉంటున్నారంటూ వారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో కౌలు చేస్తూ తాను నష్టపోయిన సంగతిని ముఖ్యమంత్రి ముందు పాములు నాయక్ కుటుంబం మొరపెట్టుకుంది. తమకు ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ అభ్యర్థించింది. దీంతో స్పందించిన చంద్రబాబు.. వారికి ఇల్లు మంజారు చేశారు. అలాగే ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. తాజాగా పాములు నాయక్ కుటుంబం ఇంటి పనులు ప్రారంభించింది. దీంతో హామీ ఇచ్చిన 11 రోజులకే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. అంటూ ఈ ఫోటోలను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.