రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఏపీ, తెలంగాణ రాజీకాయాలను వేర్వేరుగా చూడలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నేతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రాలుగా విడిపోయినా కూడా.. అన్ని పార్టీలతోనూ, పార్టీల అధినేతలతోనూ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్రనగర్ శాసనసభ్యుడైన ప్రకాష్ గౌడ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. వెంకన్న స్వామి దర్శనం తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ మార్పు గురించి తనపై ఎవరి ఒత్తిడి లేదన్న ప్రకాష్ గౌడ్.. ఎవరూ బెదిరించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.మరోవైపు టీడీపీ అధినేత చం యుడు తన రాజకీయ గురువని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. ఏపీకి ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చంద్రబాబు నిత్యం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించే ఆలోచిస్తారని కొనియాడారు.
మరోవైపు టి. ప్రకాష్ గౌడ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. టీడీపీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో 2009 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రాజేంద్రనగర్ నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ ( అప్పటి టీఆర్ఎస్)లో చేరారు ప్రకాష్ గౌడ్.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్‌పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున రాజేంద్రనగర్ నుంచి మరోసారి పోటీచేసిన టి. ప్రకాష్ గౌడ్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.