పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం. సాంబిరెడ్డికి వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ పెదకూరపాడు ఇన్‌చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు. తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.