కుప్పం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మొదట శాంతిపురం మండలం వెంకటాపురంలో నారా భువనేశ్వరికి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుడుపల్లి మండలం కుమ్మగుట్టపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లతో పాటు ఆమెకి విశేష ఆహ్వానం పలికారు. ఈరోజు కంచిబందార్లపల్లిని దత్తత తీసుకున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. గత ఎన్నికల్లో ప్రచారంలో నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ తెచ్చే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలియజేయడంతో మంగళవారం ఆమె కమ్మగుట్ట పల్లి బూత్ అత్యధిక మెజార్టీ రావడంతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు విచ్చేశారు. ఈ సందర్బంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ… కుప్పం నియోజక వర్గంలో తన తొలి రోజు పర్యటనలో భాగంగా మొదటగా రామకుప్పం మండలం పెద్దూరు గ్రామంలో పర్యటించానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వచ్చి తనను కలవడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. విద్యార్థుల చదువు గురించి, పాఠశాలల్లోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించానని అన్నారు. కుప్పంలో చంద్రబాబుని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కమ్మగుట్టపల్లి గ్రామంలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన అకృత్యలకు, దౌర్జన్యలను చుసిన మహిళలు కసితో టీడీపీకి ఓటేసి గెలిపించారని అన్నారు. కుప్పంకు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.