తాజాగా టీటీడీకి ఎలక్ర్టిక్ స్కూటర్లు విరాళంగా అందాయి. కోల్‌కతాకు చెందిన మోటోవోల్ట్ సీఈవో తుషార్ చౌదరి బుధవారం రూ.2.45 లక్షలు విలువైన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట జేఈవో వీరబ్రహ్మంకు మోటోవోల్ట్ సంస్థ ప్రతినిధులు స్కూటర్ తాళాలు అందించారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదం నాణ్యతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈవో జె. శ్యామలరావు ఈ విషయాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే రోజూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ.. తిరుమల లడ్డూ, శ్రీవారి అన్నప్రసాదం నాణ్యతను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం టీటీడీ ఈవో శ్యామలరావు రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం తయారీకి బియ్యం పంపిణీ చేసే రైస్ మిల్లర్లతో ఈవో భేటీ అయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో వీరితో భేటీ అయిన టీటీడీ ఈవో.. అన్నప్రసాదం రుచి, నాణ్యతను పెంచే విషయమై వారితో చర్చలు జరిపారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు.
ఇక ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై టీటీడీ ఈవో చర్యలు ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులపై చర్యలు చేపడుతున్నారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టిన టీటీడీ ఈవో.. మరో కంపెనీపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు సంస్థలకు సోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు. అలాగే నాణ్యతను పరిశీలించేందుకు గానూ అడల్ట్రేషన్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా నెయ్యి కొనుగోలు విషయంలో టెండర్ మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు.