ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పదిమందితో కూడిన ఏపీ పోలీసుల బృందం శశికాంత్ నివాసానికి వెళ్లింది. అయితే అప్పటికి శశికాంత్ అక్కడ లేనట్లు సమాచారం. దీంతో ఫ్లాట్ యజమాని సాయంతో ఇంట్లోకి వెళ్లిన ఏపీ పోలీసులు.. శనివారం రాత్రి నుంచి శశికాంత్ నివాసంలో సోదాలు నిర్వహించారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ఇంట్లో సోదాలు కొనసాగాయి. సీఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో పోలీసులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తం నాలుగు బాక్సుల్లో కీలక డాక్యుమెంట్లు, పైళ్లను ఏపీకి తీసుకెళ్లారు. మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనలో రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అరెస్టులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ప్రమాదం సంభవించింది. అయితే దర్యాప్తులో ఇది అగ్ని ప్రమాదం కాదని.. ఫైళ్లను తగలబెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై అటు పోలీసులు, ఇటు రెవెన్యూశాఖ దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా సైతం ఇటీవల మదనపల్లెలో పర్యటించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని సిసోదియా తేల్చారు. ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం సృష్టించారని.. సీసీ కెమెరాలను కూడా కావాలనే రిపేర్ చేయించలేదని సిసోదియా తన నివేదికలో ప్రభుత్వానికి తెలియజేశారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 2,440 ఫైళ్లు కాలిపోయాయని.. 700 ఫైళ్లను కాపాడినట్లు సిసోదియా తెలిపారు. వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో క్రమబద్ధీకరించారని.. ఇది బయటపడకుండా ఉండేందుకే ఫైళ్లను కాల్చివేశారంటూ నివేదికలు స్పష్టం చేశారు. ఈ ఘటనలో రెవెన్యూ అధికారులు కూడా కీలకంగా వ్యవహరించారని.. వారిని సస్పెండ్ చేయాలని సూచించారు.