అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15000 కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుఫున గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్.. కేంద్రంలో సహాయమంత్రి పదవి చేపట్టారు. తాజాగా అమరావతికి కేంద్రం 15000 కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఈ రేంజులో ప్రకటన ఉంటుందని ఊహించలేదని పెమ్మసాని అన్నారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారన్న పెమ్మసాని.. మూడేళ్లలో పోలవరం పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
మరోవైపు పోలవరం, అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఏపీకి రూ.80 వేల కోట్ల నిధులు వివిధ ప్రాజెక్టుల రూపంలో వస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రూ.2500 కోట్లతో అమరావతి రైల్వే లైన్ ఇప్పటికే మంజూరైందని..రూ.15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని పెమ్మసాని గుర్తుచేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా కేంద్రం సహకరిస్తుందని చెప్పుకొచ్చారు.
వీటితో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇలాంటి వన్నీ కలిపి వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి రూ.80 వేల కోట్ల నిధులు వస్తున్నాయని కేంద్ర మంత్రి శుభవార్త వినిపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మరిన్ని నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.