రైతులపై పైసా భారం పడనివ్వబోమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండలం నాగటూరు వద్ద గల మల్యాల ఫేస్1, ఫేస్2 ఎత్తిపోతల పథకం నుంచి మంగళవారం ఎమ్మెల్యే రైతుల సమక్షంలో నీటిని విడుదల చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య నాగటూరు వద్ద గల మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద పంపింగ్ స్టేషన్‌లో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ఎత్తిపోతల పథకం నీటి పారుదల శాఖ అధికారులు డీఈ నాగార్జునరావ్, ఏఈ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకం ఫెస్1 నుంచి ఒక పంపు ద్వారా 36 క్యూసెక్కుల నీటిని, ఫేస్2 పథకం నుంచి మరో పంపు ద్వారా 36 క్యూసెక్కుల నీటిని మొత్తం 72 క్యూసెక్కుల నీటిని స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిందని, తమ ప్రభుత్వంలో ఒక పైసా కూడా భారం పడనివ్వబోమని అన్నారు. రిపేర్ల ఖర్చులు, నిర్వహణ విషయమై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టికి కూడా తీసుకుని వెళ్లామని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. నిధులు మంజూరు చేయించి అన్ని ఎత్తిపోతల పథకాలను సజావుగా పనిచేయించి రైతులకు ఇబ్బంది లేకుండగా చూసుకుంటామన్నారు. మాండ్ర సురేంద్రనాథరెడ్డి, ఓబుల్ రెడ్డి, కొణిదేల గ్రామ సర్పంచ్, నవీన్ రైతు సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, బ్రహానందరెడ్డి, షమీమ్ బాషా, మల్లికార్జునరెడ్డి, రైతులు పాల్గొన్నారు.