రుణాల పేరుతో యానిమేటర్ భారీగా సొమ్ములు స్వాహా చేసినట్టు వచ్చిన ఆరోపణలపై పిఠాపురం డీఆర్డీఏ అధికారులు విచారణ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యుల పేరు మీద రూ.4 కోట్లు మేర రుణాలు తీసుకుని యానిమేటర్ పక్కదారి పట్టించినట్టు వెల్లడైంది. పిఠాపురం మండలం బి.కొత్తూరు గ్రామంలోని మహిళా శక్తి సంఘాల సభ్యుల పేరుపై పిఠాపురానికి చెందిన యానిమేటర్ పద్మకుమారి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో ఏడు బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు అందాయి. దీనిపై వారు తాము రుణాలు తీసుకోకుండా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు పిర్యాదుచేశారు. ఇప్పటికే ఒకసారి విచారణ నిర్వహించిన అధికారులు బుధవారం మరోమారు విచారణ చేపట్టారు. డీఆర్డీఏ డీపీఎం వి.పద్మావతి, ఏపీపీ ప్రియదర్శిని, పిఠాపురం బ్యాంక్ ఆఫ్ బరోడా, డీసీసీబీ, ఎస్‌బీఐ, యూనియన్‌బ్యాంకు, ఐవోబీ, విరవాడ, పిఠాపురం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధికారులు 184 మంది మహిళలను విచారించారు. తాము ఒక్క రుణం మాత్రమే తీసుకున్నామని, మూడు, నాలుగు రుణాలు తీసుకోలేదని 40 మందికి పైగా మహిళలు చెప్పారు. యానిమేటర్ తీసుకున్న రుణాలు రూ.4కోట్లుపైగా ఉన్నాయని గుర్తించారు. యానిమేటర్ తమ పేరుపై ఎన్ని రుణాలు తీసుకుందో తెలియజేయాలని మహిళలు డిమాండ్ చేశారు. లెక్కలు తర్వాత చెప్తామంటూ అధికారులు వెళ్లిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో ఎల్‌సీలు రమేష్, రామకృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.