గోదావరి వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 42.80 అడుగుల నీటిమట్టం భద్రాచలం వద్ద నమోదైంది. అనం తరం నెమ్మదిగా తగ్గుతూ సాయంత్రం ఆరు గంటలకు 41.20 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాల్లో వరద నిలకడగా ఉంది. దాదాపు ఇరవై రోజులుగా గోదావరి వరద ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. గోదావరి తీరంలో ఇంత వరకు వ్యవసాయ పనులు ప్రారంభంకాలేదు. వందలాది ఎకరాల్లో వరినారుమడులు ముంపులోనే ఉన్నాయి. పనులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. గోదావరి నీటి మట్టం గురువారం సాయంత్రానికి పోలవరం వద్ద తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 9,65,820 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం తగ్గడంతో కడెమ్మ స్లూయిజ్ వద్ద నీటిమట్టం కొంత తగ్గడంతో ఏటిగట్టుకి కుడివైపున ఉన్న కొండవాగుల జలాలు గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. ధవ ళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 14.42 మీటర్లు ఉందని, వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండడంతో 10,60,000 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేయగా మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉందని ధవళే శ్వరం బ్యారేజి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రమేష్ తెలిపారు. భద్రా చలం వద్ద నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటికి నీటిమట్టం తొలుత పెరిగి తర్వాత తగ్గే అవకాశాలున్నాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వకు గోదావరి జలాల పంపి ణీ నిలిపివేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీరు పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు.