మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అధికార దుర్వినియోగంతో బయటికి వచ్చిన ఈ వివాదం.. తప్పుడు ధృవపత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో చివరికి ఆమె ఉద్యోగమే ఊడింది. ఈ క్రమంలోనే ఆమె అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పూజా ఖేద్కర్ లాగే మరికొంత మంది సివిల్ సర్వెంట్లు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్.. పలువురు సివిల్ సర్వెంట్ల సర్టిఫికేట్లను పరిశీలన చేపట్టింది.
పూజా ఖేద్కర్ వివాదం దేశంలో సంచలనం సృష్టించడంతో మరికొందరు సివిల్ సర్వెంట్లు సమర్పించిన వైకల్య ధ్రువీకరణ పత్రాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్.. ఆ ఆరుగురు సివిల్ సర్వెంట్ల మెడికల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ ఆరుగురిలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతోపాటు ఒక ఐఆర్‌ఎస్ అధికారి కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఇటీవల మహారాష్ట్రలోని పూణెలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన పూజా ఖేద్కర్.. ప్రొబేషనరీ పీరియడ్‌లోనే.. సకల సౌకర్యాలు కావాలని.. కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం పెను దుమారానికి కారణం అయింది. ఈ క్రమంలోనే ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు ఐఏఎస్‌కు ఎంపికైన సమయంలో యూపీఎస్సీలో ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగం సాధించారని తేలింది. దీంతో నకిలీ పత్రాలతో సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ.. ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఐఏఎస్ ఉద్యోగాన్ని రద్దు చేయడమే కాకుండా ఇంకెప్పుడూ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా నిషేధం విధించింది.
ఇక ఈ కేసులో పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు.. దాన్ని గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై మోపిన అభియోగాల దృష్ట్యా పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదని అంతా భావించారు. పూజా ఖేద్కర్‌ను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ దుబాయ్‌కి పారిపోయి ఉండవచ్చని మీడియా కథనాల ద్వారా వెల్లడవుతోంది.