సాగు విద్యుత్‌పై రైతుకు పూర్తి స్చేచ్ఛ ఇవ్వాలని ఇంధన శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్సా సురక్షా ఏవమ్ ఉత్తాన్ మహాభియాన్(పీఎం కుసుమ్) పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలన్నారు. తద్వారా వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు విద్యుత్‌ను అందించవచ్చన్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగస్వాములవుతున్నామని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు స్పష్టం చేయాలని ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఇంధన శాఖపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఇంధన రంగ స్థితిగతులపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు 33 కేవీ సబ్ స్టేషన్ నుంచి 11 కేవీ సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ ప్రవాహం వల్ల 10 శాతం మేర కరెంటు నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జోక్యం చేసుకుని.. ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించేందుకు వీలుగా 11 కేవీ ఫీడర్ల పరిధిలో 2నుంచి 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల రైతు చేనుకు నేరుగా కరెంటును అందించవచ్చని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకంలో చేరడం వల్ల వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్‌ను అందించవచ్చన్నారు. గ్రామాల్లో రెండు నుంచి ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందించాలన్నారు. దీనివల్ల గ్రామా ల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. మరోవైపు 33 కేవీ ద్వారా కాకుండా 11 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా కరెంటు నేరుగా రైతుకు సరఫరా అవుతుందని వెల్లడించారు. ఔత్సాహికుల నుంచి యూనిట్‌ను రూ.2.50కే కొనుగోలు చేయడం వల్ల చౌక ధరకు విద్యుత్ లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. గతంలో వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్ ప్యానళ్లను అమర్చే పథకాన్ని అమలు చేశామని చెప్పారు. కేంద్రం సబ్సిడీ ఇస్తున్నందున ఔత్సాహికులకు 30 శాతం రాయితీ కూడా లభిస్తుందని వెల్లడించారు. కేంద్రం పీఎం కుసుమ్ పథకాన్ని 2026 మార్చి నెలాఖరు దాకా పొడిగించింది. రాష్ట్రస్థాయిలో లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ పథకం కింద వ్యక్తిగతంగానూ, గ్రూపుగానూ రైతులకు సబ్సిడీ అందిస్తుంది. రాష్ట్రంలో సోలార్ మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో స్టోర్ చేసే విధానాన్ని అమలు చేద్దామని చంద్రబాబు సూచించారు. కాగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని సెంబ్‌కార్ప్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం లభించినందున, ఈ పీపీఏకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.