వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో సరియైున వైద్యం అందక బాలింత వగ్గెల అలివేలు మంగ(23) మృతి చెందింది అని కుటుంబీకులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహించిన కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులతో, వైద్యులతో చర్చించారు. మృతురాలి భర్త రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం టి.నరసాపురం మండలంలోని అల్లూరి సీతారామరాజు మెట్ట గ్రామానికి చెందిన వగ్గెల అలివేలు మంగ(23)కు గత జూలై 27న జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 5వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అదే రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా టి.నరసాపురం పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చింతలపూడి ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకురాగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. బంధువులు ఆమె బౌతిక కాయంతో టి.నరసాపురం పీహెచ్‌సీ దగ్గర ధర్నాకు దిగారు.