నూజివీడు మండలంలోని ఒక గ్రామంలో బాలికను అపహరించి అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని సోమవారం రాత్రి నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఆదివారం ఒక లారీ గ్రామానికి వచ్చింది. లారీ డ్రైవర్, క్లీనర్ జయరావు మధ్య ఏదో విషయంపై గొడవ జరిగి, క్లీనర్ ఆదివారం మధ్యాహ్నం లారీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అదేరోజు రాత్రి 2 గంటల సమయంలో బాలిక నివాస గృహం సమీపంలో క్లీనర్ జయరావు ఒక సంచితో నడిచి వెళుతున్న దృశ్యం సమీపంలోని ఒక సీసీ కెమెరాలో రికార్డు అయి ఉంది. దీని ఆధారంగా వచ్చిన పని పూర్తికాకపోవడంతో గ్రామంలోనే ఉన్న డ్రైవర్ నుంచి క్లీనర్ సమాచారంను పోలీసులు సేకరించారు. నిందితుడు రెంటచింతలలో ఉన్నట్టు గుర్తించి సోమవారం రాత్రి అక్కడికి వెళ్ళి నిందితుడిని అదుపులోకి తీసుకుని నూజివీడు తీసుకువచ్చినట్లు సమాచారం. నిద్రిస్తున్న బాలికను నిందితుడు అపహరించి సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకుని వెళ్ళి కాళ్లపట్టీలు లాక్కుని బాలికను వివస్త్రను చేసి కొట్టి, పక్కనే ఉన్న ముళ్ళకంచెలోకి విసిరి వెళ్ళినట్టుగా సమాచారం చక్కర్లు కొడుతోంది. గాయాలపాలైన బాలిక ఏడుస్తూ రహదారిపైకి రాగానే సమీప నివాస గృహంలో ట్రాక్టర్ పనిచేసుకుంటున్న ఒక రైతు గమనించి బాధిత బాలికకు తన మనుమరాలి గౌను తొడిగి ఆమె ఇంటికి చేర్చాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వచ్చి బాలికను నూజివీడు ఆస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో నిందితుడిని అరెస్టుచేసి మంగళవారం రాత్రి మెజిస్ర్టేట్ ముందు హాజరుపరచనున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరోవైపు దోషిని కఠినంగా శిక్షించాలని నూజివీడు ఐద్వా మహిళా సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు నూజివీడు ఆర్డీవో భవానీ శంకరికి మంగళవారం వినతిపత్రం అందించారు.