మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి.. పెద్దిరెడ్డి పై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు. పెద్దిరెడ్డి భూదందాలపై జ్యుడీషియల్ విచారణ జరగాల్సిన అవసరం వుందన్నారు. కేరళలోని వయనాడ్‌లో జరిగిన ఘటన బాధాకరమని, ప్రకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారని నారాయణ విచారం వ్యక్తం చేశారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేరళ ఘటనపై ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా..మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బంగ్లాదేశ్‌లో అవినీతి, అహంభావం పెరిగిందని, ప్రజాస్వామ్యాన్ని షేక్ హసీనా చంపేశారని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరు సరైందేనని, బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం లాంటిదన్నారు.