గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతిపాలు అయ్యిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఆస్పత్రుల సెక్యూరిటీ, పారిశుద్ధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పిచ్చిపిచ్చి బ్లాండ్లు తెచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని ఆయన మండిపడ్డారు. దీన్ని వల్ల అనేక మంది కిడ్నీ బాధితులు తయారయ్యారని చెప్పుకొచ్చారు. నెల్లూరు జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్లు ప్రారంభించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అనారోగ్యం పాలైందని మంత్రి సత్య కుమార్ అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌కు ఆరు డయాలసిస్ యూనిట్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. వీటి వల్ల ఎంతోమంది కిడ్నీ బాధితులకు చికిత్స అందించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యకుమార్ చెప్పుకొచ్చారు. దేశంలో 3.40కోట్ల మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి మెరుగైన వైద్య సేవలకి, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. డయాలసిస్ యూనిట్లు దాతలు అందించడం ఆనందంగా ఉందని, మరిన్ని సంస్థలు ఇలా ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.