మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్భార్‌కు అర్జీదారులు వెల్లువెత్తున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చి పలువురు ఇస్తున్న అర్జాలను స్వీకరిస్తున్న మంత్రి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామి ఇస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం ఏఎస్పీగా పనిచేస్తున్న తియోపిల్లాస్ బంధువులు కలిశారు. గతంలో తియోపిల్లాస్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబును అసెంబ్లీలోకి రాకుండా మెయిన్ గేట్ వద్ద అప్పట్లో అడ్డుకున్న వ్యక్తి ఇతనే. ప్రస్తుతం అనంతపురం ఏఎస్పీగా పనిచేస్తున్నాడు. అయితే ఏఎస్పీగా పనిచేస్తున్న తియోపిల్లాస్ తమకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని మంత్రి లోకేష్ ముందు ఆయన బంధువు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. త్వరలో మీ సమస్యను తీరుస్తానంటూ మంత్రి లోకేష్.. బాధితురాలికి అభయమించారు. అనంతరం అనంతపురం ఏఎస్పీ తియోపిల్లాస్ బాధితురాలు మరియమ్మ మీడియాతో మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా అప్పుగా తీసుకున్న డబ్బులు తియోపిల్లాస్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ‘‘నా వెనుక జగన్ ఉన్నారు.. మీరు నన్ను ఏమీ చేయలేరు’’ అంటూ బెదిరిస్తున్నాడన్నారు. 22 లక్షల రూపాయలు ప్రస్తుతం అనంతపురం ఏఎస్పీగా ఉన్న తియోపిల్లాస్ తనకు ఇవ్వాల్సి ఉందన్నారు. పొలం తాకట్టు పెట్టి డబ్బులు అప్పు ఇస్తే పోలీస్ అధికారిగా ఉన్న తియోపిల్లాస్ డబ్బులు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరిస్తున్నాడని వాపోయారు. ‘‘నా సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లా.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు’’ అని మరియమ్మ పేర్కొన్నారు.