వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను జగన్ అవమానించారని మండిపడ్డారు. ‘అధికారం ఉన్నప్పుడు ప్రజల డబ్బులతో జగన్ విలాసలు. అధికారం పోవడంతో జగన్‌కు మతి భ్రమించి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం పెట్టి తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది. అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రూ.404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. రూ.226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశాడు. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్. దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడారు. బాధిత కుటుంబాలను ఎప్పుడైనా సీఎంగా పరామర్శించావా అని’ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు.