ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై సమీక్ష జరిపారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగానే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
మరోవైపు సమాజంలో వివక్షను ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తోంది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. పింఛన్‌తో పాటుగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా పలు పథకాలు అమలుచేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ట్రాన్స్‌జెండర్ల కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్డులు కూడా అందిస్తున్నారు. వీటితో పాటుగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు కూడా అందించి వారికి తోడ్పాటుగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే రేషన్ కార్డులు జూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అయిన నేపథ్యంలో.. కొత్త రేషన్ కార్డుల విషయంపైనా దృష్టిసారించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పట్లో రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే గతేడాది కాలంగా ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఆగిపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇటీవల ప్రకటన చేశారు. కొత్తగా పెళ్లైన జంట.. రేషన్ కార్డు దరఖాస్తు చేసే సమయంలో వివాహ ధ్రువీకరణ పత్రం చూపిస్తే సరిపోతుందని ఇటీవల మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.