నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూలు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. శనివారం ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్‌లో 60 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని బస్సు డ్రైవర్లు, పన్నులు చెల్లించని బస్సు యాజమానులపై తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.రామచంద్రరావు తెలిపారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారు బస్సు నడపకూడదు. అయితే ఓ బస్సు డ్రైవర్‌కు 60 ఏళ్లకుపైన ఉన్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. మరో రెండు బస్సులు క్వార్టర్ ట్యాక్స్ చెల్లించకపోగా, ఒక బస్సుకు అసలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదు. ఇరువురు డ్రైవర్లు లైసెన్సులు లేకుండా, నలుగురు యూనిఫాం ధరించకుండా బస్సు నడుపుతున్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు ఎంవీఐ తెలిపారు. నిత్యం తనిఖీలు చేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా స్కూలు బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.