శృంగవరపుకోట- కొత్తవలస రహదారిలోని అప్పన్నపాలెం సమీపంలో వ్యాన్‌లో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని కొత్తవలస పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి. అరకు నుంచి వస్తున్న వ్యాన్‌ను శంగవరపుకోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. దీంతో లక్కవరపుకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారికీ దొరకలేదు. ఈ సమాచారంతో కొత్తవలస పోలీసు సిబ్బంది కొత్తవలస - అరకు రోడ్డును బ్లాక్ చేశారు. ఎంతసేపటికీ వ్యాన్ రాకపోవడంతో అనుమానం కలిగి శృంగవరపుకోట రోడ్డులో వెతికారు. అప్పన్నపాలెం సమీపంలో రోడ్డు మధ్యలో వ్యాన్‌ను గుర్తించారు. అందులో ఎవరూ లేరు. వ్యాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర రిజిస్ర్టేషన్‌తో ఉందని సీఐ తెలిపారు. వ్యాన్ వెనుకభాగంలో కూరగాయలకు సంబంధించిన ప్లాస్టిక్ కేట్స్‌తో ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా కప్పి ఉంచారు. ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ కేట్స్‌ను తొలగించి చూడగా 16 గోనె సంచులలో గంజాయి గుర్తించారు. రెండుకేజీలు, 5 కేజీలుగా ప్యాకింగ్ చేసి ఉంది. అవన్నీ కలిపి 400 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందన్నారు. నిందితుని ఆచూకీ కోసం బృందాలుగా వెతుకుతున్నామని సీఐ తెలిపారు.