తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని.. అక్రమ సంపాదన కోసం నా వర్గానికి చెందిన 25 మంది టీడీపీ నేతలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. త్వరలో ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విచారణ జరగనుందని.. ఇకపై ఇసుక అక్రమ రవాణా ఆపాలని.. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానన్నారు.
గతంలో అక్రమంగా ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదన్నారు ప్రభాకర్ రెడ్డి. తన కోసం ఐదేళ్లు కష్టపడ్డారని.. ఇసుక రవాణా చేసి తనకు దూరం కావొద్దని తన వర్గీయులకు సూచించారు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని.. ఇసుక ఎట్లా అమ్మాలో తనకు తెలుసన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టేది లేదని.. వాళ్లేనా డబ్బులు సంపాదించుకునేది మిగతావారు లేరా? అంటూ కొందరు టిప్పర్ యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మీ అందరూ నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు. కానీ, ఇసుకతో నాకు దూరం కావద్దు' అని సూచించారు. తాను కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంతో పోగుట్టుకున్నానని.. అలా అని తాను వెళ్లి ఇసుక తోడుకోవడం లేదు కదా? అన్నారు. అవసరం అయితే మున్సిపాలిటీ ద్వారా ఇసుక రవాణా చేద్దామని.. తాడిపత్రి మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేద్దామని పిలపునిచ్చారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవాళ్లు.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నదిలోకి టిప్పర్లు వెళితే వాటిని సీజ్ చేస్తామని.. ఒక్కసారి కేసు నమోదు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఇసుక అక్రమ రవాణా దారులు ఇకనైనా బుద్దిగా ఉండాలని సూచించారు. సొంత పార్టీకి చెందిన నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.