ఆంధ్రప్రదేశ్‌లో చెట్లను నరికివేయడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కోనో కార్పస్ మొక్కలు/చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మరో ఇద్దరు ఈ పిల్‌ను హైకోర్టులో వేశారు. కోనో కార్పస్ మొక్కలతో మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని పిల్‌లో ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ మొక్కలు నాటొచ్చా లేదా అనేది శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిల్‌లో కోరారు.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా కోనో కార్పస్ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలుచేయాలని పిల్‌లో కోరారు. అలాగే ఈ కోనో కార్పస్ మొక్కల్ని ప్రత్యామ్నాయ ప్రదేశంలో నాటేలా అధికారులను ఆదేశించాలని కోరారు. రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలు, చెట్ల నుంచి వెలువడే పుప్పొడితో ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడతారని, అవి ఆక్సిజన్ విడుదల చేయవు అనడం అపోహలని పిల్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలను కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిల్ పరిష్కారం అయ్యేవరకు రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్ చెట్లను నరికివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ కోనో కార్పస్ చెట్ల గాలి ప్రజల ప్రాణాలకు ముప్పని, జంతువులు సైతం ఆ మొక్కలను తినవని.. వాటి వేర్లు భూగర్భంలో వేసిన పైప్‌లైన్లను ధ్వంసం చేస్తాయని.. ఎన్నో విధాలుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పిల్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఈ మొక్కలు, చెట్లపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలా కోనో కార్పస్ మొక్కలు, చెట్లపై ఆరోపణలన్నింటికి ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేవు అన్నారు. అంతేకాదు ఈ మొక్కలు, చెట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో అధికారులు సైతం ఈ చెట్లను కొట్టేయడాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా పిల్‌లో ప్రస్తావించారు.
ఇటీవల కాకినాడ జిల్లాలో 4,600కుపైగా కోనో కార్పస్ చెట్లను కొట్టేశారని పిల్‌లో పేర్కొన్నారు. అంతేకాదు నెల్లూరు జిల్లాలో చెట్లను ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయని ప్రస్తావించారు. అందుకే ఈ కోనో కార్పస్ చెట్లను పరిరక్షించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాము ప్రస్తావించిన ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చెట్ల కొట్టివేతను ఆపేయాలన్నారు. ఈ మేరకు ఈ పిల్‌లో సీఎస్, పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక సీఎస్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శితో పాటుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి.. కాకినాడ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఈ పిల్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిల్‌పై బుధవారం విచారణ చేయనుంది.