ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతుల కోసం కేంద్రం పశుకిసాన్ క్రెడిట్ కార్డులను (పీకేసీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు పశువులు, దాణా, మేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బందిపడుతుంటారు.. అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు అర్హులైన రైతులు.. పశుసంవర్ఢకశాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీసీ కార్డులు అందిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డుల్ని జారీ చేశారు.. మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే.. ఒకవేళ అర్హులు ఉండి.. వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. పశుపోషకులకు ఎంతో ప్రయోజనకరమైన పీకేసీసీ కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు. ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకుని వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న డబ్బుల్ని 40 రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఒకవేళ 40 రోజులు దాటాక చెల్లిస్తే 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు.. ఇందులో 3 శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అంటే రైతుపై కేవలం 4 శాతం వడ్డీనే పడుతుంది.
బ్యాంకులు రూ.1.60 లక్షల వరకు ఇస్తాయి. అవసరమైనప్పుడు ఈ డబ్బుల్ని వాడుకుని.. పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా 40 రోజుల్లోగా జమ చేయొచ్చు. మళ్లీ డబ్బులు తీసుకోవచ్చు.. ఇలా ఈ కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. ఈ కార్డులు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.. ఈ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే.. ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి.
కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా 4 శాతం వడ్డీకి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఇందులో రూ.1.6 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు.. రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు ఈజీగా రుణాలు తీసుకోవచ్చు.