దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ గత కొంతకాలంగా వైద్య విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారం రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' అనే విద్యార్థి సంఘం చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణలతో కోల్‌కతా రోడ్లు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.
హౌరా బ్రిడ్జి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్ర సచివాలయం నబన్నా వరకూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని రోడ్లపైనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిపై టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు.
మరోవైపు ఈ ర్యాలీలతో రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. నిరసన ప్రదర్శన నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ పరిధిలో 25 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి దారితీసే మార్గాల్లో 30 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షించారు. నిరసన ర్యాలీలు చట్టవిరుద్ధమంటూ జిల్లా యంత్రాగం ప్రకటించినప్పటికీ 'నబన్నా అభియాన్' ర్యాలీతో ముందుకు వెళ్లాలని పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ నిర్ణయించింది. రెండు ప్రధాన ర్యాలీలను ప్లాన్ చేసింది. సెంట్రల్ కోల్‌కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ఒక ర్యాలీ, హౌరాలోని సాంత్రగచ్చి నుంచి మరో ర్యాలీని నిర్వహించ తలపెట్టింది.
ఈ ర్యాలీలను అడ్డుకునేందుకు హౌరాలో 2వేల మంది పోలీసులు మోహరించారు. నలుగురు ఏడీజీలు, 13 మంది డీఐజీలు, 15 మంది ఎస్పీ ర్యాంక్ అధికారులు భద్రతను పర్యవేక్షించారు. ఉదయం నుంచి పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలతో కోల్‌కతా, హౌరాలో వాహనాల రాకపోకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించగా.. వారు సోమవారం అర్ధరాత్రి సమయంలోనే అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ మార్చ్ నేపథ్యంలో ప్రజాజీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు, ఆందోళనకారులపై పోలీసుల తీరుకు నిరసనగా బుధవారం బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.