రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల ముగిసిన మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కూడా ఇరువురూ చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) )వేదికగా వెల్లడించారు. ‘అధ్యక్షుడు పుతిన్‌తో ఈ రోజు మాట్లాడాను.. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణతో పాటు ఇటీవలే కీవ్‌లో నా పర్యటనకు సంబంధఇంచిన ఆలోచనలను కూడా పంచుకున్నాను.. వివాదాన్ని శాంతియుత, వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ వివరించారు.
అటు, పుతిన్, మోదీ మధ్య జరిగిన సంభాషణ గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భారత్-రష్యా 22వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా గత నెలలో జరిగిన తన రష్యా పర్యటనను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారని పేర్కొంది. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిని సమీక్షించారని, భారత్, రష్యా మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారని తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది.
అలాగే, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని వివరించింది. ఈ సందర్భంగా ఇటీవల తన ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఆలోచనలను పుతిన్‌తో పంచుకున్న మోదీ.. సంబంధిత భాగస్వాములు అందరూ శాంతికి కట్టుబడి ఆచరణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
కాగా, గతవారం ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. రష్యాతో యుద్ధంపై ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో చర్చించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమాధికారం సహకారానికి సిద్ధమంటూ ఇరు దేశాధినేతలు అంగీకరించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.