అమరావతిలోని సచివాలయంలో పత్తిలో వ్యర్థాల తొలగింపు, రైతులకు అధిక ధర లభ్యంపై జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లరు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత సమావేశమయ్యారు. పత్తిలో వ్యర్థాల వల్ల ధర తగ్గుముఖంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2017-18లో 20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగ్గా, 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తికి తగ్గిపోయిందన్నారు. ప్లాస్టిక్, గోనె సంచుల్లో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయట పడుతున్నాయన్నారు. దీనివల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందన్నారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి తెలిపారు. పత్తి సేకరణ సమయంలో కాటన్ సంచులు వాడకం వల్ల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడే అవకాశం ఉండదన్నారు. దీనికి వ్యవసాయశాఖాధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని మంత్రి సవిత సూచించారు.