సీజనల్ వ్యాధులు విజృంభించి, ప్రజలు రోగాల బారినపడి అవస్థలు పడుతున్నా వైద్యాధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన 1, 2, 4, 7 స్థాయి సంఘాల సమావేశాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లోని వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వైద్యారోగ్యశాఖపై నిర్వహించిన చర్చ వాడివేడిగా సాగింది. మలేరియా, డెంగ్యూ కేసులు వస్తున్నాయని, ప్రతీ ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారని చైర్మన్‌తో పాటు ప్రజాప్రతినిధులు నిరాశ వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామంలో ఇటీవల తల్లీకూతుళ్లు మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైందని, వైద్యారోగ్యశాఖ అధికారులు ఏమి చేస్తున్నారని సభ్యులు నిలదీశారు. రోగులు పీహెచ్‌సీలకు వెళితే పైఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు, సెలైన్‌లు, పరికరాలు నిల్వ ఉంచాలని, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు రోగులను ఉంచే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. వసతి చాలకపోతే తమ దృష్టికి తీసుకువస్తే ప్రత్యామ్నయం చూపేవారమని చెప్పారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం బాగోలేదన్నారు. జడ్పీ ఉప చైర్మన్ బాపూజీనాయుడు అధ్యక్షతన జరిగిన మూడో స్థాయి సంఘ సమావేశంలో వ్యవసాయంపై చర్చించారు. కౌలు రైతులకు రుణాలు అందించాలని, పంట బీమా సదుపాయం కల్పించాలని జడ్పీటీసీలు కోరారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై చర్చ నిర్వహించగా జిల్లాలోని అనాథ శరణాలయాలు, బాలల వసతి కేంద్రాలను తనిఖీ చేసి, అక్కడ వసతి, భద్రతా ఏర్పాట్లపై నివేదికను అందజేయాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో సీఈవో శ్రీధర్‌రాజా, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, ఉమ్మడి జిల్లాల జడ్పీటీసీ సభ్యులు, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.