రైతులకు సరిహద్దులతో కూడిన భూమి సర్వే ధృవీకరణ పత్రాలను అంద జేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశపుహాలులో మంగళవారం రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన రెవెన్యూ విభాగంలో అర్జీలపెండింగ్, నీటితీరువా వసూళ్లు, భూమి మ్యుటేషన్, కౌలురైతులకు గుర్తింపుకార్డులజారీ, జిల్లాలో చౌకధరల దుకాణాలలో ఉన్న ఖాళీల భర్తీ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మీకోసం కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యల పరిష్కారంపై సరైన ఎండార్స్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. భూమి సమస్యలపై అర్జీలు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో రెవెన్యూ సదస్సులు జిల్లావ్యాప్తంగా నిర్వహించాల్సి ఉందని, ఈ సదస్సులలో భూమి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వివాదాలులేని భూములకు సంబంధించి సబ్‌డివిజన్ సక్రమంగా చేయాలని సూచించారు. వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు దరఖాస్తులు వస్తే క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. అనధికార లేఅవుట్లను గుర్తించి ప్లాన్ అప్రూవల్ అధికారులకు, రిజిస్ర్టేషన్‌విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఈ అంశంపై అర్డీవోలు ప్రత్యేకంగా ధృష్టి సారించాలన్నారు. ఓటర్లజాబితాల సవరణ-2025ను షెడ్యూలు ప్రకారం చేయాలన్నారు. అక్ట్టోబరు 18వతేదీలోగా ఇంటింటికీ తిరిగి ఓటర్లజాబితాల పరిశీలన ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. బందరుపోర్టు, డీఆర్‌డీవో, ఏపీఐఐసీ, వివిద పరిశ్రమలకు భూములకేటాయింపు తదితర అంశాలలో అధికారులు దృష్టి సారించాలని అన్నారు.